Saturday, 23 July 2016

గురు బ్రహ్మలు

బడిగంట మ్రోగగానే
తమ గళం విప్పి విద్యా బోధ ప్రారంభిస్తారు
విద్యార్ధులకు శిక్షణతో పాటు
క్రమశిక్షణ నేర్పడానికి
తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారు !

అల్లరిపిల్లల పట్ల కఠినంగా ఉన్నా
బుద్ధిమంతుల పట్ల మెతకవైఖరితో ఉన్నా
పాఠాలు చెప్పేటప్పుడు మాత్రం
ఎటువంటి వివక్షతా చూపని సహృదయులు !

మొదటి బెంచీ పిల్లల దగ్గర నుండి
చివరి బెంచీ పిల్లల వరకు
తమ కంఠ స్వరాన్ని సాగదీస్తూ
పాఠాలు చేరవేస్తారు !

అరుస్తూ పాఠాలు చెప్పడమంటే
తమ శక్తిని జ్ఞానంగా చేసి
విద్యార్ధుల బుర్రల్లో విజ్ఞానం నింపడమే !

నల్లబల్లపై సుద్దముక్కతో రాస్తున్నప్పుడు
ధూళికణాలు కాలుష్యమై
ముక్కుకి,నోటికీ అడ్డంపడి
దగ్గు జబ్బుని వారికి దగ్గర చేస్తుంది !

డస్టర్ తో నల్లబల్లను తుడుస్తున్నప్పుడు
శరీరం మొత్తం ధూళి వస్త్రం అవుతుంది !

విషయ పరిజ్ఞానం నూరిపోయడానికి
తరగతి గదినే భూగోళం చేస్తారు
విజ్ఞానం వికసింప జేయడానికి
తరగతి గదినే ప్రయోగశాల చేస్తారు
గురువులకు విద్యార్ధులే సర్వస్వమై
తరగతి గదే విశ్వ మౌతుంది !

విద్యాభ్యాసం పూర్తిచేసుకొని
విద్యార్ధులు బడిని వదిలి వెళ్లిపోతున్నప్పుడు
ఆత్మబంధం విడిపోతున్నట్లు బాధపడతారు !

పూర్వ విద్యార్ధులు ప్రయోజకులై ఎదురైనప్పుడు
గురువులు సగర్వంగా తలపైకెత్తి
ఆనందంతో ఎవరెస్టు శిఖరాలౌతుంటారు !

ఆటలాడి, పాటలు పాడి
పాఠాలు చెప్పి, ప్రబోధాలు చేసే గురువులు
చతుర్ముఖ బ్రహ్మ స్వరూపాలు !

అంతరాలు లేని
తరాలను తయారుచేసే గురువులు
అంతర్ముఖంగా అమ్మ స్వరూపాలు !

తల్లిదండ్రులకు పిల్లలు ఒక్కరో,ఇద్దరో
విద్యార్ధులందరూ గురుబ్రహ్మలకు పిల్లలే !

No comments:

Post a Comment