Saturday, 23 July 2016

‘కబాలి’ లో భారతీయుల గురించి రజనీకాంత్ ఎలాంటి సెటైర్ వేశాడో తెలుసా

‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన పీతల కథ అద్భుతంగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా.. మెజార్టీ భారతీయులు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది  ఆ కథ. రజనీకాంత్ ‘కబాలి’ లో చెప్పిన కథ ఏంటంటే.. ఓ తొట్టెలో బోలిడన్నీ పీతలు ఉంటాయి.. అయితే, అందులోంచి ఎలాగైనా బయటపడి తన ప్రాణాలు నిలుపుకోవాలని ఆ పీతలన్నీ ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలోనే ఓ పీత క్రమంగా పైకి  వెళ్లాలని ప్రయత్నిస్తూ ఆ తొట్టె ఎత్తులో సగానికి పైకి చేరుకుంటుంది. ఇది చూడలేక.. మరో పీత  పైనున్న పీతను క్రిందకు లాగేస్తుంది. ఇలా, ఒక పీత పైకి వెళ్దామనుకుంటే.. మరో పీత దాన్ని కిందకు లాగేస్తుండటంతో.. ఆఖరికి ఒక్క పీత కూడా తొట్టె నుంచి బయటపడలేకపోతుంది. ఈ రకంగా, ఓ భారతీయుడు  పైకెదుగుతుంటే.. మరో భారతీయుడు తట్టుకోలేడు’ అని రజనీకాంత్‌ సినిమాలోని ఓ సందర్భంలో చెబుతాడు.

రజనీకాంత్‌ చెప్పిన ఈ మాటలు నూటికి నూరు శాతం నిజమని చెప్పలేం కానీ.. 75 శాతం పైగా నిజం!  పూర్వపు రోజుల్లో మన దేశపు రాజుల మధ్య ఏమాత్రం ఐకమత్యం ఉండేది కాదు. ఈ ఐకమత్యం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకునే.. మొదట్లో మహమ్మదీయ రాజులు..ఆ తర్వాత బ్రిటీష్ వారు భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. అప్పట్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే.. ఒక స్వదేశపు రాజును దెబ్బతీయడానికి మరో స్వదేశపు రాజు విదేశీ రాజులతో కుమ్మక్కయ్యేవాడు. ఔరంగజేబు, మహ్మద్ గజిని ఇలా ఇంకొందరు.. మన రాజులలో ఐకమత్యం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ కారణంగానే, కొన్ని దశాద్దాల పాటు.. వలస పాలకుల చేతిలో మన దేశ  ప్రజలు నరకయాతన అనుభవించారు. ఈ ఐకమత్యం లోపంచిన కారణంగానే, మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మహ్మమదీయ రాజులకి.. ఆ తర్వాత బ్రిటీష్ వాళ్లకి మనం మన మాన, ధన ప్రాణాల్ని సమర్పించుకోవాల్సి వచ్చింది.. అప్పట్లో పరిస్థితులు అలా ఉంటే.. ఇప్పటి పరిస్థితులు కూడా పెద్దగా ఏం మారలేదు.

దీనికి ఉదాహరణగా.. మన యూనివర్సిటీలో జరుగుతున్న రీసెర్చి  కార్యక్రమాలను చెప్పుకోవచ్చు! మన దేశపు యూనివర్సిటీల్లో రీసెర్చి స్కాలర్స్ జరుపుతున్న పరిశోధనల  కోసం ప్రతీ ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుపెడుతున్నప్పటికీ.. ఇప్పటి దాకా మనం ఆశించినంత అవుట్‌ఫుట్‌ ను మన పీహెచ్‌డీ స్టూడెంట్స్ అందించలేదు. అలాగని, మన విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణలు చేసే సత్తా లేక కాదు. మనం ఆశించినంత  ప్రతిఫలాన్ని మన విద్యార్థులు అందించకపోవడానికి కారణం.. మన వ్యవస్థలో ఉన్న లోపాలే ! మన యూనివర్సిటీలో ఓ రీసెర్చి విద్యార్థికి ఓ కొత్త ఐడియా లేక ఓ వినూత్నమైన పరిశోధన చేద్దామన్న ఆలోచన వస్తే.. సాధారణంగా పైస్థాయిల్లో ఉండే ప్రొఫెసర్లు వెంటనే ప్రోత్సహించారు.  సదరు విద్యార్థి కి వచ్చిన అద్భుతమైన  ఐడియా ను  లేదా రీసెర్చ్ పాయింట్ ను మొగ్గలోనే తుంచేందుకు వివిధ డిపార్ట్‌మెంట్లలో ఉండే ప్రొఫెసర్లు  ప్రయత్నిస్తుంటారు. తన విద్యార్థి తనకన్నా పైకెదగకూడదనే విపరీత లక్షణమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  ఒక వేళ, సదరు విద్యార్థి రీసెర్చి కి ఒప్పుకున్నా ఆ తర్వాత అతడికి అనేక ఆటంకాలు కల్పిస్తుంటారు. ఇక, మన దేశపు యూనివర్సిటీ లో మరో రకం ప్రొఫసర్లు ఉంటారు. వీరు తమ రీసెర్చి విద్యార్థులని ప్రతిభ కారణంగానే ప్రోత్సహించడం కన్నా.. సదరు విద్యార్థి తనకి ఎంత వినయ, విధేయతలు ప్రదర్శిస్తున్నాడునే విషయాన్నే పరిగణలోకి తీసుకుంటారు. తాను చెప్పిన ప్రతీ అడ్డమైన పనిని ‘జీ హుజూర్’ అని చేసుకుంటూ పోతూ..  తాను చెప్పిన ప్రతీ మాటను  శిరసావహిస్తున్నాడా అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వ్యవస్థ లోపాల కారణంగానే, ప్రస్తుత యువత తన భవిష్యత్‌ రీసెర్చి కార్యక్రమాలకు విదేశి యూనివర్సిటీల వైపు చూస్తున్నారు.

కేవలం రీసెర్చి వ్యవస్థే కాదు.. మన దేశపు వ్యాపార రంగం కూడా ఇలాగే ఉంది. ఓ వ్యక్తి వ్యాపారంలో పైకెదుగుతుంటే.. అతడి ఎదుగుదలను చూడలేక.. అతడిని దెబ్బతీయడానికి ప్రయత్నించి.. సక్సెస్ అయిన వ్యాపార దిగ్గజాలు మన దేశంలో చాలా మందే ఉన్నారు. అంతేకానీ, పై కెదుగుతున్న వ్యక్తితో పోటీపడి.. అతడి కంటే ఎక్కువగా కష్టపడి.. రాణించాలన్న తపన మన దిగ్గజ వ్యాపారుల్లో అతి కొద్దమందికి మాత్రమే ఉంది.  ఇక క్రీడల్లో.. ముఖ్యంగా క్రికెట్‌లో ఈ పరిస్థితి ఇంకా  దారుణంగా  ఉంది! గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న టౌన్‌లలో అపారమైన ప్రతిభావంతులు ఉన్నప్పటికీ వారికి అవకాశాలు దక్కడం మన దేశంలో చాలా కష్టం! కారణం..   సెలక్షన్‌ ప్రక్రియలో.. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ.. ప్రతిభావంతులని క్రిందకు లాగేసి..  వాళ్లని నిరుత్సాహపరిచి.. కేవలం ‘తమ’ వాళ్లని మాత్రమే సెలెక్ట్ అయ్యేడట్టు మన దేశంలో లాబీయింగ్ జరుగుతోంది.

No comments:

Post a Comment