Friday, 3 June 2016

పని-ఫలితం

ఈ భువిపై అసాధ్యమైనది ఏదీ లేదు. మనిషి సాధించలేనిదంటూ ఉండదు.సాధనమున ధరణిలో పనులన్నీ సమకూరతాయని ఉపదేశించాడు వేమన.ఒక పని చేయడానికి ముందు, మంచి ఆలోచన కావాలి. తరవాత దాన్ని పూర్తిచేయాలనే పట్టుదల ఉండాలి. పనిలో దీక్ష, శ్రద్ధ కనబరచాలి. అప్పుడే సత్ఫలితాలు పొందగలుగుతాం.చేసే పనిని బట్టి ఫలితం ఉంటుందని ‘యోగవాసిష్ఠం’ చెబుతోంది. ఎప్పుడు ఏ పని చేస్తే బాగుంటుందో ఆలోచించి, అప్పుడు ఆ పని ప్రారంభించాలి. అలాగని అనువైన కాలాన్ని వృథాగా గడపకూడదు. ఆలోచనా రహితంగా ఏ పనీ చేయకూడదు. సకాలంలో సక్రమంగా విధులను నిర్వర్తించని రాజు, తన రాజ్యాన్ని సైతం నిలబెట్టుకోలేడని రామాయణం అరణ్యకాండలో హెచ్చరిస్తాడు వాల్మీకి. అందుకే మంచి ఆలోచనైనా మంచి సమయంలో చేస్తేనే ఫలిస్తుందని పెద్దలంటారు.ఏ పనినైనా ఇష్టపడి చేయాలి. చేసే పనిలో ఆసక్తి, ఉత్సాహం, సంతోషం ఇమిడి ఉండాలి. అప్పుడే దక్కాల్సిన ఫలితం, దానంతటదే వచ్చి చేరుతుంది. నీతిశాలి, కార్యదక్షుడు, ప్రణాళికాబద్ధుడైన శ్రీరామచంద్రుడి కార్యాన్ని వానరాలే నిర్వహించాయి. సముద్రానికి సేతువు కట్టి, రాక్షస సేనను ఓడించి, సీతను రాముడికి అప్పగించాయి.యజమాని కార్యసాధకుడైతే, నేర్పరితనంతో ముందడుగు వేస్తే, సేవకులు అతడినే అనుసరిస్తారు. కార్యాన్ని విజయతీరం వైపునడిపిస్తారు.ఏ మనిషికైనా, తనకు నచ్చిన పని చేయడం వల్లనే సంపూర్ణ ఆనందం కలుగుతుంది. ఇతరులను అనుకరించడం వల్ల ఆత్మానందం దొరకదు. ఉన్నతమైన ఆలోచనల్ని అమలుచేయాలంటే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇది నియమాలు, నిగ్రహశక్తి వల్ల సాధ్యపడుతుంది. దీక్షగా పని చేసేవారు ఎక్కువగా మాట్లాడరు. ఎందుకంటే- మాటలు, పనులు ఏకకాలంలో సాగవు.ప్రకృతిని పరిశీలించండి, అది ఎప్పుడూ మౌనంగా, నిర్విరామంగా తన పని తాను చేస్తుంటుంది. నిత్యం పువ్వులు, ఫలాలు అందిస్తూ తన ఉనికి చాటుకుంటుంది. ఏ రుతువులో ఆ ధర్మాన్ని పాటిస్తుంది. మనమూ వ్యర్థమైన మాటల్ని కట్టిపెట్టి, జీవితం సార్థకమయ్యే పనుల వైపు దృష్టి కేంద్రీకరించాలి.పనిచేస్తేనే మనిషి ఉక్కులా దృఢంగా ఉంటాడు. పని లేకపోతే సోమరిగా మారతాడు. ఏ పనీ లేని మనిషిలో చెడు ఆలోచనలు ప్రవేశిస్తాయి. అశాంతి కారణంగా అతడు అనారోగ్యం పాలవుతాడు. మనిషి ఎంత ధనవంతుడైనా, ఏదో ఒక పనిమీద దృష్టిపెట్టాలి. భగవంతుడికి ప్రీతికరమైన సేవాకార్యక్రమాల్లోనైనా పాలుపంచుకోవాలి.ఒక పని సాధించాలనుకున్నప్పుడు ఎన్నో భయాలు, సందేహాలు కలగడం సహజం. అర్థం లేని భయాలు, అనుమానాలతో వెనకడుగు వేయడం కంటే ఆశావాదంతో అడుగు ముందుకు వేయడం మంచిది.విజేతలను వారి గెలుపు రహస్యం అడిగితే ‘కష్టపడి పనిచేయడం’ అని జవాబిస్తారు. థామస్‌ ఆల్వా ఎడిసన్‌ బల్బు కనిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రయత్నించిన వెంటనే ఆశించిన ఫలితం రాలేదని నిరాశ చెందలేదు. ఆశించిన ఫలితం వచ్చేవరకు ప్రయోగాలు చేసి, చివరకు ఆయన విజయం సాధించారు.మనిషి ప్రతి వైఫల్యం నుంచీ ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ తప్పు మళ్లీ చేయకుండా సాధన సాగిస్తే, తప్పకుండా విజేత కాగలడు.లక్ష్య సాధన నిర్దిష్టంగా ఉండాలి. దృఢమైన సంకల్పం జతపడాలి.ఏ పనినైనా, నూటికి నూరుపాళ్లూ మనసుకు సంతృప్తి కలిగేలా చేయాలి. పనిలో పూర్తిగా మమేకం కావాలి. గంగను భువికి రప్పించిన భగీరథుడిలా, కార్యసాధకుడైన ఆంజనేయుడిలా ప్రతిమనిషీ తన సంకల్పాన్ని సఫలీకృతం చేసుకోవాలి. అప్పుడే అతడుఆశించినదానికన్నా మరింత ఎత్తుకు ఎదుగుతాడు!

No comments:

Post a Comment