Thursday, 29 October 2015

మేము మర్చిపోలేదు.. క్షమించలేదు! - ఇజ్రాయిల్ చరిత్ర - 1

నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో బాంబు ప్రేలుడు... 11 మంది మృతి... క్షతగాత్రులు రెండు వందలు పైమాటే... ఇప్పటికే చాలామంది ఈ సంఘటన మర్చిపోయే ఉంటారు.. ఈ రోజుల్లో అత్యంత సర్వసాధారణమైన ఇలాంటివాటిని ఎవరయినా ఎక్కువ కాలం ఎందుకు గుర్తుంచుకుంటారు చెప్పండి...


టెర్రరిస్టు దాడి చిన్నదయితే అంటే ఒక్కచోట మాత్రమే ప్రేలుడు సంభవించి మృతులు పదుల సంఖ్యలో ఉంటే, ఆ సంఘటన తాలూకు వివరాలు వార్తాప్రసారాల నుండి, మన మనసు నుండి కూడా ఒకటి రెండు రోజులలోనే తొలగిపోతాయి. అదే ఆ  సంఘటన పెద్దదయితే అంటే ఏక కాలంలో అనేక చోట్ల ఈ ప్రేలుడు సంభవించి మృతుల సంఖ్య వందల సంఖ్యలో ఉన్నా, లేక ఆ పేలుళ్ళలో ఎవరైనా రాజకీయ ప్రముఖులు ఎఫెక్ట్ అయినా కొన్నాళ్లపాటు దేశమంతా హడావుడి ఉంటుంది.

ఇది పిరికిపందల చర్య  అని రాజమాత ఇటలీ గాంధీ సెలవిస్తే .. ప్రజలంతా సంయమనంపాటించాలని, మనం అందరం ఐకమత్యం చూపించాల్సిన సమయం వచ్చిందని ముఖంలో ఏ ఫీలింగ్ బయటపడకుండా గంభీరంగా మన ప్రధానమంత్రి గారు పత్రికాప్రకటనలు విడుదల చేస్తారు. గంటగంటకి వేసుకున్న సూటు మళ్ళీ వేసుకోకుండా, మేకప్ చెరిగిపోకుండా కెమెరా ముందు ప్రకటనలు గుప్పించే హోమ్ మినిస్టర్లూ, "ఓలమ్మో ఇంత పెద్ద దేశంలో ఏ పక్క నుండి ఎవడు వచ్చి బాంబు విసురుతాడో తెలీదు, ఈ టెర్రరిస్టులను అదుపులో పెట్టడం అంత ఈజీ కాదు" అని వాపోయే హోమ్ మినిస్టర్లూ.. మనకి ఆదర్శప్రాయులయిన రాజకీయ నాయకులే! ......   అసలు ప్రపంచంలో టెర్రరిజం ఎక్కడ లేదు, అభివృద్ధి చెందిన దేశాలే ఈ టెర్రరిస్టుల దెబ్బకి విలవిలలాడుతుంటే ఇక మనమెంత అని తను భారతీయుడని చెప్పుకోవడానికి సిగ్గుపడే మన యూత్ ఐకాను, ఇస్లామిక్ టెర్రరిజంలో 'ఇస్లామిక్' అన్న మతపరమయిన రిఫరెన్స్ తీసేయ్యమని ఒక పక్క ప్రపంచం అంతా కోరుతుంటే, అది సరిపోనట్టు టెర్రరిజంకి కొత్త మతరంగులు పులిమే దిగ్విజయ్ లాంటి దగుల్బాజీలు మన ముందు బోల్డు మంది. మేముంటే ఏదో పొడిచేస్తాం, పోటా లాంటి కొత్త కొత్త చట్టాలు తెచ్చి టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాం అని చెప్పుకునే పార్టీలు కూడా గతంలో అదే తీవ్రవాదుల్ని దగ్గరుండి విమానంలో కాందహార్ లో దింపి వచ్చిన సిగ్గుమాలిన సంఘటన మర్చిపోయారేమో! ఏదయినా ఓటు బ్యాంక్ రాజకీయాలు, నిలువెల్లా స్వార్ధం, ఎంత జరిగినా రెండు రోజులకే మర్చిపోయి మాములైపోయే ఉదాసీనత,మనకీ మన కుటుంబానికి నష్టం కలగకపోతే చాలు ఎవరినయినా ఇట్టే క్షమించే అతి జాలిగుణం, ఒకటా రెండా...  మన పరిస్థితికి ఇలా ఎన్నో కారణాలు... అందులో చాలామటుకు సాధారణ పౌరులుగా మన బాధ్యత కూడా చాలా ఉందనుకోండి.


హా... మీదంతా ఉడుకు రక్తం.. ఆలోచన లేకుండా ఆవేశం ఒక్కటీ పనికి రాదు.. ఇప్పుడు ఏం చెయ్యాలంటారు... అమెరికాలా తన మీద దాడి చేసినవాడిని పట్టుకోవడానికి  వేల కోట్లు ఖర్చుపెట్టి సంవత్సరాల తరబడి యుద్ధం చేసేంత సామర్థ్యం మనకి ఉందా అని కొంతమంది అడుగుతారు.  నిజమే.. అసలు మనం అలా యుద్ధానికెళితే "నా నొప్పి నీ నొప్పి సమానం కాదు అందువల్ల నాకో రూలు, నీకో రూలు" అనే అమెరికానే ఊరుకోదు ముందు... మనం మనం యుద్ధం చేసుకుంటే వాడికి కలిసొచ్చేది ఏం లేకపోతే వాడు ఆంక్షలు విధించో, మిగతా యూరోప్ వాళ్లతో కలిసి ఒత్తిడి తెచ్చో మనల్ని ఆపడానికే ప్రయత్నిస్తాడు. మిగతా దేశాల నుండి వచ్చే ఒత్తిడి తట్టుకుని, వేల కోట్లు ఖర్చుపెట్టి , అన్నిటికన్నా మన అంతర్గత దేశ ద్రోహులయినటువంటి కుహనా లౌకిక వాదుల గోల తట్టుకుని యుద్ధం చేసేంత సీన్ నిజంగా మనకి ఉందంటారా!


సరే... ఇవి చర్చించడానికి ఈ పోస్ట్ కాదనుకోండి... అయితే చరిత్రలో జరిగిన ఒక (ఇన్)ఫేమస్ టెర్రరిస్టు సంఘటన, తదనంతర సంఘటనలు మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది అని నా అభిప్రాయం.
  *        *       *

 చాప్టర్ -1 : టెర్రరిజం


అది 1972 సంవత్సరం సెప్టెంబర్ నెల.. వెస్ట్ జర్మనీ (ఇప్పుడు జర్మనీ) లోని మ్యూనిచ్ నగరంలో సమ్మర్ ఒలంపిక్స్ జరుగుతున్నాయి. జర్మనీలో అంతకుముందు జరిగిన ఒలంపిక్స్ హిట్లర్ హయాంలో అనేక ఆంక్షల మధ్య, భయాల మధ్య జరిగి ఉండటంతో, ఆ చెడ్డపేరు చెరిపెయ్యడానికి అన్నట్టు ఈ ఒలంపిక్స్ లో భద్రతా కట్టుబాట్లు కాస్త సడలించారు. ఆటగాళ్ళు ఒలంపిక్ విలేజ్ నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్లి వచ్చే సౌకర్యం, గుర్తింపు కార్డుల కోసం పెద్ద చెకింగ్లు అవీ లేకపోవడం, ఒకవేళ కాని టైం లో బయటకు వెళ్లి రావాల్సి వస్తే గోడ దూకి వచ్చినా నిర్వాహకులు, భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వదిలెయ్యడం... అలా అంత ఫ్రీ గా అన్నమాట.  అయితే ఆ రోజుల్లో పాలస్తీనా టెర్రరిస్టుల నుండి ఎక్కువ ముప్పు ఎదుర్కొంటున్న ఇజ్రాయిల్ ఆటగాళ్లకు మిగతా ఆటగాళ్ళు ఉండే భవంతులకు దూరంగా మరీ గోడ పక్కనే ఉన్న భవంతి విడిదిగా ఇవ్వడంతో, ఆ దేశ ఆటగాళ్ళు తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినా జర్మన్ అధికారులు అంత పట్టించుకోలేదు. అప్పటికీ జర్మన్ నిపుణుడు ఒకరు ఈ ఒలంపిక్స్ లో మనకి (జర్మన్లకి) ఏ రకంగా ఇబ్బందులు ఎదురయే అవకాశం ఉంది అని ఒక 26 పాయింట్లు సూచించగా... అందులో ఇరవై ఒకటవ పాయింటు ఇలా టెర్రరిస్ట్ అటాక్ జరగవచ్చు అని ఉంది.


సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి ఇజ్రాయిల్ ఆటగాళ్లంతా ఒక మ్యూజికల్ చూసి, తమ ఫేవరేట్ నటుడితో డిన్నర్ ముగించి, పార్టీ అనంతరం అర్ధరాత్రి సమయాన బస్ లో ఒలంపిక్ విలేజ్ కి చేరుకున్నారు. ఒలంపిక్ విలేజ్ కి చేరుకున్న ఆటగాళ్ళందరూ మంచి గాఢనిద్ర లో ఉండగా సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం సుమారు 4:30 సమయం లో ఆటగాళ్ళలా ట్రాక్ సూట్స్ వేసుకున్న "బ్లాక్ సెప్టెంబర్" అన్న తీవ్రవాద సంస్థకి చెందిన ఎనిమిది మంది టెర్రరిస్టులు తుపాకులతో, పిస్టల్స్ తో, హ్యాండ్ గ్రెనేడ్లతో గోడ దూకి  ఒలంపిక్ విలేజ్ లోకి ప్రవేశించారు. సరాసరి ఇజ్రాయిలీ ఆటగాళ్ళు ఉన్న భవంతిలో ప్రవేశించి దొంగ తాళాలతో తలుపులు తియ్యడానికి ప్రయత్నిస్తున్నారు. అపార్ట్మెంట్ 1 లో నిద్రలో ఉన్న Yossef Gutfreund అనే రెజ్లింగ్ కోచ్ కి తలుపు దగ్గర ఏదో శబ్దం రావడంతో లేచి తలపు సందు నుండి చూడగా... బయట తుపాకులు పట్టుకున్న ముసుగు వ్యక్తులు కనిపించడంతో గట్టిగా కేకలు పెడుతూ మిగతావారిని లేపడానికి ప్రయత్నిస్తూ ఉండగా... ఇంతలో టెర్రరిస్టులు తలుపులు పగలకొట్టి లోపలకి రావడంతో వాళ్ళని తాత్కాలికంగా నిలువరించేందుకు 135 kg రెజ్లింగ్ బరువు కూడా వాళ్ళపై విసిరాడట. యూసఫ్ అరుపులు విన్న అతని సహచరుడు కిటికీ దూకి పారిపోగాలిగాడు కానీ.. యూసఫ్ మాత్రం తీవ్రవాదులకి దొరికి పోయాడు.
 
అక్కడ ఎదురు తిరిగిన మరో రెజ్లింగ్ కోచ్ మెషె వియంబెర్గ్ ని అతని దవడలో తుపాకితో కాల్చి తీవ్ర గాయం చేసి మిగతా ఆటగాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళమని హింస పెట్టారు. అయితే అటువంటి  విపత్కర పరిస్థితిలో కూడా వియంబెర్గ్ సమయస్ఫూర్తితో ఆలోచించి అపార్ట్మెంట్ 2 లో ఉన్నవారు ఇజ్రాయిల్ ఆటగాళ్ళు కాదని అబద్ధం చెప్పి ఇజ్రాయిలీ రెజ్లర్స్ వున్న అపార్ట్మెంట్ 3 కి తీసుకెళ్లాడట. అపార్ట్మెంట్ 2 మరియు 3 లో ఉన్నది ఇజ్రాయిల్ ఆటగాళ్ళే అయినా.. ఒకవేళ తీవ్రవాదులను నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితే వస్తే మిగతావారి కన్నారెజ్లర్లు బలవంతులు కాబట్టి కాస్తయినా నయమని అని అతని ఆలోచన. బిల్డింగ్ 3 లోకి వెళ్ళాక టెర్రరిస్టులని ప్రతిఘటించే ప్రయత్నం చేసాడని వియంబెర్గ్ నీ, ఎదురు తిరిగిన ఇంకో వెయిట్ లిఫ్టర్ యోసేఫ్ రొమనో ని కూడా తీవ్రవాదులు కాల్చి చంపి అక్కడ కనపడ్డ మిగతా తొమ్మిది మంది ఆటగాళ్ళను బందీలుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలా బిల్డింగ్ 2 లో ఉన్న మిగతా ఆటగాళ్ళు, అధికారులు ఈ అటాక్ తప్పించుకోగలిగారు.


బందీలుగా పట్టుబడ్డ ఆటగాళ్ళని విడుదల చెయ్యడానికి  టెర్రరిస్టులు విధించిన ఆంక్షలలో ముఖ్యమయినది "వివిధ ఇజ్రాయిలీ జైళ్ళలో ఉన్న 234 పాలస్తీనా టెర్రరిస్టులను వదిలిపెట్టాలి".  అలాగే తీవ్రవాదులు తమ క్రూరత్వాన్ని, తలచుకుంటే ఏమయినా చెయ్యగలం అన్న తెగింపుని తెలియచెప్పడానికి అంతకు ముందు హింసించి చంపిన వియంబెర్గ్ శవాన్ని కిటికీలోనుండి బయటకు విసిరేశారు. అయితే.. వారి ఆంక్షలకూ, డిమాండ్లకూ ప్రతిగా ఇజ్రాయిల్ ఇచ్చిన సమాధానం..


"there would be no negotiation ..."


అప్పటికే జర్మనీ పై యూదుల పట్ల ఉన్న ద్వేషం తాలూకు మచ్చ ఉండటం, ఇప్పుడేమో బందీలుగా ఉన్నది యూదులు అవడంతో జర్మన్ అధికారులు తీవ్రవాదులతో చర్చలు జరిపి కావలసినంత డబ్బు ఇస్తాం అని చెప్పారట.. అక్కడ "కావలసినంత" అన్న పదం నిజంగా వాడినది.. అయితే ఆ ఆఫర్ ని టెర్రరిస్టులు తిరస్కరించారు. అయితే ఒక పక్క ఇంత జరుగుతున్నా ఇంకో పక్క యథావిధిగా కొనసాగుతున్న ఒలంపిక్ క్రీడల్ని ఈ తతంగం జరిగిన  పన్నెండు గంటల తరువాత తీవ్రవాదులు మూడో క్రీడాకారుడిని చంపడంతో అప్పటికి ఆటల్ని తాత్కాలికంగా ఆపేశారు. అప్పుడు ఇజ్రాయిలీ ఆటగాళ్ళని బందీలుగా ఉంచిన బ్లాక్ సెప్టెంబర్ తీవ్రవాదిని పక్కనున్న ఫోటోలో చూడవచ్చు.

బందీలుగా ఉన్న ఆటగాళ్ళ  పరిస్థితి ఆ పక్క బిల్డింగ్ నుండి ఈ తతంగం అంతా గమనిస్తున్న ఒక అమెరికన్ క్రీడాకారుడి మాటల్లో చెప్పాలంటే..


" Every five minutes a psycho with a machine gun says, 'Let's kill 'em now,' and someone else says, 'No, let's wait a while.' How long could you stand that? "


ఆటలు తాత్కాలికం గా రద్దు అవడం తో మొత్తం ఒలంపిక్స్ ని కవర్ చెయ్యడానికి ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన మీడియా అంతా ఇక్కడికే చేరింది. తీవ్రవాదులను అటాక్ చెయ్యడానికి మొదటి ప్రయత్నంగా జర్మన్ పోలీసులు క్రీడాకారుల వేషంలో ఆ బిల్డింగ్ ని చుట్టుముట్టారు. అయితే అప్పటికే అక్కడకు చేరిన టీవి మీడియా ఈ అటాక్ సన్నాహాలన్నీ పూసగుచ్చినట్టు టీవిలలో ప్రసారం చెయ్యడంతో, అది చూసిన టెర్రరిస్టులు పోలీసులు వెనక్కి వెళ్ళకపోతే ఇంకో ఇద్దరిని చంపుతాం అని బెదిరించడంతో పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే అసలు బందీలు ఇంకా బ్రతికే ఉన్నారు అని రుజువు చెయ్యడానికి, ఆటగాళ్ళలో జర్మన్ వచ్చిన వారిని కిటికీ దగ్గరకు తీసుకు వచ్చి మాట్లాడించమని కోరడంతో అంద్రే స్పెడ్జర్, కెహట్ షార్ అనే ఆటగాళ్ళతో మాట్లాడించారు. అప్పుడు కిటికీ నుండి టివి మీడియాతో మాట్లాడుతున్న స్పెడ్జర్, షార్ లను పక్క ఫోటోలో చూడవచ్చు. అయితే అలా మాట్లాడుతున్నప్పుడు టెర్రరిస్టులు చెప్పమన్నదానికన్నా ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించిన స్పెడ్జర్ ని టివి చానళ్ళు ప్రసారం చేస్తుండగా ప్రపంచం అంతా చూస్తుండగానే తుపాకి బట్ తో కొట్టుకుంటూ పక్కకి లాక్కెళ్ళడం వాళ్ళ క్రూరత్వానికి పరాకాష్ట.

ఈ లోగా ఆ బందీలను తీసుకుని ఈజిప్ట్ లోని కైరో వెళ్ళడానికి వాళ్ళ కోసం విమానం సిద్ధం చెయ్యాలనీ, ఒలంపిక్ విలేజ్ నుండి ఎయిర్ పోర్ట్  కి వెళ్ళడానికి మిలటరీ హెలికాప్టర్స్ కావాలని తీవ్రవాదులు కొత్త డిమాండ్స్ పెట్టారు. జర్మన్ అధికారులు ఈ డిమాండ్స్ కి పైకి అంగీకరిస్తూనే, విమానం ఎక్కేముందే ఆ చుట్టుపక్కల షార్ప్ షూటర్లను ఏర్పాటు చేసి టెర్రరిస్ట్లను మట్టుపెట్టాలని పథకం రచించారు. అది ఫెయిల్ అయితే విమానంలో పైలట్ల వేషంలో పోలీసు అధికారులు ఉండి అక్కడయినా టెర్రరిస్ట్లను అంతమొందించాలన్నది ప్లాన్. అయితే ఒక పక్కన హెలికాప్టర్స్ లాండ్ అవుతున్న టైం లో ఆఖరు నిముషం లో ఫ్లైట్ లో పోరాడాలన్న ఆలోచన విరమించుకుని పైలెట్ల వేషంలో ఉన్న పోలీసులు అందరూ వెళ్ళిపోయారు. హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యాక వారిలో టోనీ, ఇస్సా అనే టెర్రరిస్ట్లు విమానం చెక్ చెయ్యడానికి వచ్చి అక్కడ పైలెట్లు ఎవరూ లేకపోవడంతో ఏదో జరుగుతుంది అని గమనించి హెలికాప్టర్స్ లో ఉన్న మిగతా టెర్రరిస్ట్లను హెచ్చరించడానికి పరిగెడుతుండగా ఆ పక్క బిల్డింగ్ మీద నక్కి ఉన్న జర్మన్ షార్ప్ షూటర్లు వారిపై కాల్పులు జరిపారు. అయితే వెలుతురు సరిగ్గా లేకపోవడం, ఆ షార్ప్ షూటర్లు అంత నిపుణులు కాకపోవడంతో ఆ కాల్పులు టోనీని కేవలం గాయపరచగలిగాయి.


ఈ ఊహించని పరిణామానికి మిగతా టెర్రరిస్టులు బేజారెత్తిపోయి కాల్పులు మొదలు పెట్టగా జర్మన్ పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. తీవ్రవాదుల దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి ఖర్చయిపోతుండటంతో సెప్టెంబర్ 5 అర్ధరాత్రి 12 గంటల సమయంలో, టెర్రరిస్టులు తము చనిపోవాల్సిన పరిస్థితే కనుక వస్తే తమ కన్నా ముందు ఈ ఇజ్రాయిలీ ఆటగాళ్ళు చావాలని... నిరాయుధులై, చేతులు కాళ్ళు కట్టివెయ్యబడి, నిస్సహాయంగా చూస్తున్న అమాయక ఇజ్రాయిలీ ఆటగాళ్ళ మీద విచ్చలవిడిగా కాల్పులు జరిపి అందరినీ అతి దారుణంగా చంపివేసారు. అలా ఒలంపిక్ విలేజ్ లో ముగ్గురిని, ఎయిర్ పోర్ట్ లో ఎనిమిది మందితో కలపి మొత్తం పదకొండు మంది ఇజ్రాయిలీ ఆటగాళ్ళని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు. అదే కాల్పులలో ఒక జర్మన్ పోలీసు అధికారి కూడా టెర్రరిస్ట్ తూటాలకు నేలకొరిగాడు. జర్మన్ పోలీసుల ఎదురుకాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్ట్లు మరణించగా మరో ఇద్దరు జర్మన్ అధికారులకి దొరికి పోయారు. ఒక టెర్రరిస్ట్ తప్పించుకుని పారిపోయాడు. అయితే ముగ్గురు టెర్రరిస్ట్లు దొరికిపోయారని కూడా కొంతమంది చెప్తారు.


ఫలితంగా ఆధునిక ఒలంపిక్ చరిత్రలో మొదటి సారిగా క్రీడలు కొన్ని రోజుల పాటు రద్దయ్యాయి. ఆ రోజు జరిగిన మెమోరియల్ సర్వీస్ లో మరణించిన ఆటగాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ మెమోరియల్ సర్వీస్ లోనే పాల్గొన్న మెషె వియంబెర్గ్ కజిన్ అక్కడే గుండెపోటుతో మరణించడం మరింత బాధాకరం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి జరిగింది. టెర్రరిస్టుల చేతిలో చనిపోయిన అమాయక ఇజ్రాయిలీ క్రీడాకారులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ స్టేడియంలో ఉన్న అన్ని దేశాల జాతీయ పతాకాలు అవగతం చేస్తుండగా.. ఈ యూదుల మరణాన్ని గౌరవిస్తూ తమ దేశ పతాకాలు అవతనం చెయ్యడం మాకు సమ్మతి కాదు అని పది అరబ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో ఆ పది దేశాల పతాకాలు మాత్రం మళ్ళీ ఎగురవేశారు. అలాగే సెప్టెంబర్ 5 న ఇజ్రాయిలీ క్రీడాకారులు ఇంకా బందీలుగా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని గోల్డా మేయర్ జరిగిన దుశ్చర్యను ఖండించి తమ క్రీడాకారుల ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడినా ఒక్క జోర్డాన్ రాజు కింగ్ హుస్సేన్ తప్ప ఇంకే అరబ్ దేశం ఈ టెర్రరిస్టు చర్యను ఖండించలేదు.


ఇదే సంఘటన మనకి జరిగితే ఏం చేస్తాం? ఆ క్రీడాకార్లుల్లో క్రికెటర్స్ లేకపోతే అసలు మనమూ పట్టించుకోం... ఇంకో ఢిల్లీ అనుకుంటాం... అదే ప్రముఖ వ్యక్తులు ఉంటే ... యథావిధి మన నాయకుల నుండి ఈ పిరికిపంద చర్యను ఖండిస్తూ ప్రకటనలు వస్తాయి.. యథావిధిగా పాకిస్తాన్ కి ఉత్తుత్తి బెదిరింపులు... కొవ్వొత్తుల ప్రదర్శనలు... ఫేస్ బుక్ లో సంతాప సందేశాలు.. అంతే... కొన్నాళ్ళకి అన్నీ మర్చిపోయి క్షమించేస్తాం! కాదంటారా ? 
 
అయితే ఈ మ్యూనిచ్ టెర్రరిస్ట్ దాడి తరువాత ఏం జరిగింది? ఇజ్రాయిల్ ఏం చేసింది? మంచి జేమ్స్ బాండ్ సినిమాకి ఏ మాత్రం తీసిపోని ఇజ్రాయిల్ యొక్క రియాక్షన్ కోసం ...ఈ టపాకి కొనసాగింపు రెండో భాగంలో చూడండి.

No comments:

Post a Comment