Tuesday, 19 April 2016

ఎమ్మెల్యే అయినా సైకిళ్లు రిపేర్ చేసుకుంటూ బతికాడు

ఎమ్మెల్యే అయినా సైకిళ్లు రిపేర్ చేసుకుంటూ బతికాడు.. డబ్బుల్లేక రెండోసారి టికెట్ వద్దన్నాడు!

ఇదేదో బీసీ కాలం నాటిదో.. సెవెన్టీస్ టైమ్ లోని స్టోరీయో కాదు.. ఇప్పటిదే! ఆ మహనీయుడు మనతో బతుకుతున్నాడు. రాజకీయాల్లో అవినీతి గురించి మాట్లాడే ముందు ఈ నాయకుడి గురించి తెలుసుకోవాలి. అవినీతి చేయకుండా రాజకీయంలో బతికుతున్న అతి కొద్ది మంది నాయకుల్లో ఇతనొకరు.. పేరు నల్లతంబి.. ఊరు మద్రాస్.. పార్టీ డిఎండికె.

మామూలుగా ఎన్నికల్లో టికెట్ కోసం కోట్లు ఖర్చు పెడతారు. గెలుపు కోసం ఇంకొన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఓ వైపు కోటీశ్వరులు టికెట్ల కోసం నానా తిప్పలూ పడుతుంటే పెద్ద పార్టీ టికెట్ నే వద్దనేశాడు నల్లతంబి. పోనీ రాజకీయాలకు కొత్తా అంటే కాదు.. ఐదేళ్ల పాటూ ఎమ్మెల్యేగా పనిచేశాడు. పార్టీ అధిష్టానం టికెట్ ప్రకటించే ముందే ఈయనే డైరెక్టుగా అధిష్టానాన్ని కలిశాడు. విజయ్ కాంత్ దగ్గరకు వెళ్లి ఈసారి తనకు టికెట్ వద్దనీ.. ఎన్నికల్లో ఖర్చుకు సరిపడా డబ్బులు లేవని చెప్పేశాడు. ఇంకొకడైతే టికెట్ తనకే ఇవ్వమని అడిగి ఎక్కడో అక్కడ డబ్బు తెచ్చే వాడు. ఆ డబ్బు తిరిగి తీర్చడానికి అవినీతి చేసేవాడు. కానీ మన తంబికి అవినీతి రోగం అంటలేదు. అందుకే ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఏం సంపాయించకుండా అలానే ఉన్నాడు. పైగా తమిళ ఎమ్మెల్యేలకు మన దగ్గర ఉన్నన్ని జీతాలు కూడా లేవు. దీంతో నల్లతండి డెసిషన్ మిగిలిన తంబీలకు షాకే.

చెన్నపట్నంలోని పురసైవాక్కంలో సైకిల్ రిపేర్ షాపు ఒకటుంది. దాని ఓనరే ఈ నల్లతంబి.. విజయకాంత్ స్థాపించిన డిఎండికె పార్టీలో చురుకుగా పనిచేసేవాడు. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ యువజన విభాగం ఉప కార్యదర్శి వరకూ ఎదిగాడు.. నల్లతంబి సిన్సియారిటీ, కమిట్మెంటు నచ్చి స్వయంగా విజయకాంత్ పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్మూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. బలమైన డిఎంకె అభ్యర్థిని తక్కువ తేడాతో ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పుడే అందరి ఫోకస్ నల్లతంబిపై పడింది. ఏ హంగూ లేకుండా సాదా సీదాగా బతికేవాడు నల్లతండి.

నల్లతంబి జీవితం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.. ఎమ్మెల్యే అయ్యాక సైకిల్ రిపేర్ షాపులో కూర్చోవడం కష్టం. కష్టం అంటే నామోషీ కాదు.. నిత్యం జనాలతో కలవాల్సిన, తిరగాల్సిన పనులు ఎమ్మెల్యేకి చాలా ఉంటాయి. దీంతో ఎమ్మెల్యేగా వచ్చే జీతమే ఆధారం. జీతమంటే మన ఆంధ్ర-తెలంగాణల్లో ఇస్తున్నట్టు అక్కడ 2-3 లక్షలు ఇవ్వరు. తమిళనాడులో ఇప్పుడు ఎమ్మెల్యే జీతం నెలకు 55 వేలు. దీంతోనే నెలంతా నెట్టుకొచ్చేవాడు నల్లతంబి. అందులోనే పీఏ జీతం, ఆఫీసు మెయింటినెన్సు, ట్రాన్స్పోర్టు.. అన్నిటికీ మించి నెల నెలా కుటుంబం గడవడానికి కూడా ఆ జీతమే ఆధారం. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండానే ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. (మామూలుగా ఎమ్మెల్యేల జీతాలు పెరిగితే కోపం వస్తుంది కానీ.. ఇలాంటోళ్లను చూసినప్పుడు ఎమ్మెల్యేకి 5 లక్షల జీతం ఇచ్చినా తప్పులేదనిపిస్తుంది!). కుటుంబం ఇంత భారంగా నడుస్తున్నా ఎక్కడా కక్కుర్తి పడలేదు. ఎమ్మెల్యే హోదాలో.. అది కూడా చెన్నై నగరంలో ముఖ్యమైన ప్రాంతమైన ఎగ్మూరు ప్రాంతానికి ఎమ్మెల్యే అంటే మాటలు కాదు.. ఎవరినీ నోరు తెరిచి అడగకపోయినా నెల నెలా లక్షల రూపాయలు వచ్చి పడతాయి. కానీ నల్లతంబి అలా చేయలేదు. నల్లతంబి నిజాయితీకి ఎన్నో ఉదాహరణలున్నాయి.

అసెంబ్లీలో వివాదాలు నడుస్తూనే ఉంటాయి. ఒక రోజు సభలో నల్లతంబి సహా చాలా మంది డిఎండికె ఎమ్మెల్యేల మీద వేటు పడింది. ఆరు నెలలు సస్పెండ్ చేశారు. మిగిలన వాళ్లకి అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ నల్ల తంబికి సమస్యే. ఎందుకంటే సస్పెండ్ చేసిన సమయానికి జీతం రాదు. అలాగని పని చేసుకోలేడు.. ఎందుకంటే ఆ సమయంలో ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. దీంతో మనోడి పరిస్థితి అర్థం చేసుకుని సస్పెన్షన్ లో ఉన్నన్నాళ్లూ నెలకు 10 వేల రూపాయల చొప్పున ఖర్చులకు పంపించాడు విజయకాంత్.. వాటితోనే బొటా బొటీగా సర్దుకుని బతికాడు.

మనోడి నిజాయితీని పట్టి చూపే మరో ఉదాహరణ ఉంటుంది. ఇప్పుడు మన రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఓసారి గుర్తు చేసుకోండి. నియోజకవర్గం అభివృద్ధి అని పట్ట పగలు పచ్చి అబద్ధాలు చెప్పి సిగ్గులేకుండా పార్టీలు మారుతున్నారు మనోళ్లు. కానీ నల్లతంబిని తమ పార్టీలోకి తీసుకోవాడానికి ఎంత మంది ప్రయత్నించినా లాభం లేకపోయింది. పార్టీ మారితే 15 కోట్ల రూపాయల డబ్బు ఇస్తామని చెప్పినా నల్లతంబి వినలేదు. తను జీవితాంతం సైకిల్ షాపు నడిపినా సంపాయించలేనంత డబ్బు అది. కానీ తంబి లొంగలేదు. తనకు టికెట్ ఇచ్చిన పార్టీకి ద్రోహం చేయబోనని ఎదుటి పార్టీ వాళ్లకు తెగేసి చెప్పేశాడు.

5 సంవత్సరాలు గిర్రున తిరిగాయి. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. నల్లతంబి టికెట్ కి ఢోకా లేదు. విజయకాంత్, ఆయన భార్య ప్రేమలత టికెట్ల లిస్టుపై కూర్చున్నారు. అందులో ముందు ఓకే చేసిన పేరు నల్లతంబిదే. అలా జరుగుతుందన్న విషయం నల్లతంబికీ తెలుసు. కానీ ప్రకటన కంటే ముందే విజయకాంత్ ని కలిశాడు. టికెట్ వద్దని సున్నితంగా చెప్పాడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో నెగ్గడానికి కోట్లు కావాలనీ.. తనకు అంత స్తోమత లేదని చెప్పేశాడు. అయితే పార్టీ విజయం కోసం పనిచేస్తానని మాటిచ్చాడు. టికెట్ తప్ప ఏ పనైనా అప్పజెప్పండని చెప్పడంతో.. విజయకాంత్ భార్య ప్రేమలతకు తోడుగా ఎన్నికల ప్రచారానికి పంపుతున్నారు నల్లతంబిని.

ఈ విషయంలో విజయకాంత్ తప్పు కూడా ఉంది. అటువంటి నిజాయితీ పరులను వదులకోవడం పిచ్చి పని. అతని దగ్గర డబ్బు లేకపోతే పార్టీ ఫండ్ నుంచైనా ఖర్చు చేసి, అతన్ని ఒప్పించి టికెట్ ఇచ్చుండాల్సింది. బాగా డబ్బున్న వాళ్లు, టికెట్ల కోసం ఎదురు పెట్ట గలిగే వాళ్లు చాలా మందే పోటీ చేసి ఉంటారు కదా. వారి దగ్గర నుంచైనా వసూలు చేసి నల్లతంబిని గెలిపించుకుని ఉంటే బావుండేది. కానీ ప్రస్తుతానికి ఆ ఛాన్స్ లేదు.

ఒకటి నిజం… తమిళనాడు అసెంబ్లీలోని నిఖార్సయిన నాయకుడిని వచ్చే సభలో చూడలేకపోవచ్చు.. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలే సర్వస్వం కాదు.. సభ మొత్తం నల్లతంబి లాంటి నాయకులే నిండిపోయే రోజు రావాలని కోరుకుందాం. అందుకోసం ప్రయత్నిద్దాం. కంగారుపడకండి. ప్రయత్నించడం అంటే మీరేమీ రోడ్డు మీదకి రావక్కర్లేదు. ఐదేళ్లకోసారి పోలింగ్ బూత్ కి వెళ్లి పది నిమిషాలు స్పెండ్ చేయండి చాలు! జై నల్లతంబి!

No comments:

Post a Comment