Saturday, 23 April 2016

కష్టమంటే ఏంటీ?

అప్పట్లో కష్టం అంటే ! తినడానికి సరైన తిండి దొరక్క, చదివినా ఉద్యోగం దొరక్కపోవడం, భార్యకి భర్తపోరు, అత్తపోరు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు, ఆరుగాలం కష్టపడిన రైతుకి పంట చేతికి అందకపోవడం, ఇంటిల్లపాది ఒక్కరి సంపాదనతో బ్రతకడం, చాలిచాలని జీతాలు ఇలా ఒకస్థాయిలో ఉండేవి. మిగిలిన వాటికి చాలావరకు సర్దుకుపోయేవారు. సరిపెట్టుకునేవారు.

ఇప్పుడు కష్టం రూపురేఖలు మారిపోయాయి..
పరీక్ష తప్పితే కష్టం, అమ్మ తిడితే కష్టం, నాన్న కొడితే కష్టం, పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం, సరైన చీర కొనకపోతే కష్టం, ఎవరైనా ఎదురొస్తే కష్టం, పొద్దున్నే లేచి ఎవడి ముఖం చూసినా కష్టమే, సినిమాకో షికారుకో ఇంట్లోవారో, బయటివారో తీసుకెళ్ళకపోతే కష్టం, నచ్చింది దొరక్కపోతే కష్టం, తనకి నచ్చింది ఎవరైనా తీసుకుంటే కష్టం, పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అనే కష్టం, నచ్చినవాళ్ళు దొరక్కపోతే కష్టం, ఎదురు చెప్పడం కష్టం, తన మాట నేగ్గకపోవడం కష్టం, ప్రతి చిన్నవిషయం కూడా నేటివారికి కష్టంగానే కనిపిస్తుంది.  ఇప్పటివారి కష్టాలకి లక్ష్యమైన కారణం ఒక్కటే..

అనుకున్నది దొరకాలి. అప్పుడు కష్టం లేనట్లు. పిన్నీసు దొరక్కపోయినా ప్రాణం పోయేంత కష్టం వచ్చినట్లు బాధలు పడిపోతున్నారు. ఇవి నాటికీ నేటికి కష్టాల్లో వచ్చిన మార్పులు.
 అప్పట్లో చదువులు లేవు కదా మనస్సు చాలా బలంగా ఉండేది. ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగారు. ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా తల తాకట్టు పెట్టయిన కోరిందల్లా కాళ్ళ ముందు పెడుతున్నారు దీంతో ప్రతీది కష్టమే! చదువులు ఎక్కువయ్యాయి కదా! మానసిక బలం తగ్గిపోయింది. నేనేదో చదువులు మీద యుద్ధం చేస్తున్నాను అనుకోకండి.

పిల్లలకి ఇప్పటి కొత్తతరం పెద్దలకి చెప్పేది ఏంటంటే! చదవండి చదివించండి. దాంతోపాటే కష్టపడడం నేర్పండి. మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ పెంచండి. మేము పడుతున్న కష్టం చాలు పిల్లలు ఎందుకు పడాలి అనుకోవడం అంత పెద్దపోరబాటు  ఇంకోటి లేదు. 

No comments:

Post a Comment