Thursday, 4 February 2016

Heart attack - how to know - గుండెపోటుకు మొదటి లక్షణమేది?

గుండెపోటుకు మొదటి లక్షణమేది?

అకస్మాత్తుగా గుండెలో ఏదో మంటలా అనిపిస్తుంది. క్షణాల్లో అది ఎడమ ఛాతీకి వ్యాపిస్తుంది. చెమటలు పడతాయి. కళ్లు తిరిగి పడిపోవచ్చు. మొత్తానికి తనకు ఏదో జరుగుతోందని, తాను బతకకపోవచ్చని రోగికి అనుమానం వస్తుంది. ఇవన్నీ గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు. వీటిని గుర్తించి, వెంటనే చికిత్స ప్రారంభిస్తే గుండెపోటువల్ల సంభవించే మరణాన్ని వీలైనంత మేరకూ తగ్గించవచ్చు.

గుండెకు రక్తాన్ని సరఫరాచేసే క్రమంలో అకస్మా త్తుగా రక్తం గడ్డకట్టినప్పుడు ఒక ప్రాంతానికి రక్తం ఆగిపోతుంది. అప్పుడు అందులో ఉండే కణాలు దెబ్బ తింటాయి. దీన్నే గుండెపోటు అంటాం. రక్తం గడ్డ కట్టడానికి కారణం రక్తనాళాల గోడల్లో నిక్షిప్తమైన కొలెస్ట్రాల్‌. వయసు పెరిగే కొద్దీ ఇది సాధారణంగా వస్తుంది. మధుమేహం, ధూమపానం, రక్తపోటు, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, లేదా వంశపారం పర్యంగా కొందరికి ఇలాంటివి ఉన్నవాళ్లకు రక్తనాళాల గోడ లోపల కొలెస్ట్రాల్‌ అధిక మోతాదులో నిక్షిప్తమై ఉంటుంది. ఇది అకస్మాత్తుగా చిట్లుతుంది. దీన్ని ప్లేక్‌ రప్చర్‌ అంటారు. చిట్లినప్పుడు కొలెస్ట్రాల్‌ రక్తంలో కలిసి, రక్తం గడ్డకడుతుంది. కానీ రక్తంలో ఉండే ప్లేట్‌లెట్స్‌కు ఒకదానికి ఒకటి అతుక్కునే గుణం ఉంటుంది. రక్తనాళం చిట్లినచోట ప్లేట్‌లెట్స్‌ వచ్చి, అతుక్కుంటాయి. క్షణాల్లో వందలాది, వేలాది ప్లేట్‌లెట్స్‌ ఒకదానిపై ఒకటి అతుక్కొని రక్తనాళం మొత్తాన్ని బ్లాక్‌ చేస్తాయి. ప్లేట్‌లేట్‌లు అతుక్కోవడమేగాక మధ్యలో ఫైబ్రీన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది మధ్యలో ఒక వలలాగా ఏర్పడుతుంది. మధ్యలో కణాలు జారిపోకుండా రక్తం గడ్డలాగా తయారవుతుంది. రక్త ప్రవాహం ఆ గడ్డ వరకే వస్తుంది. దాన్ని దాటి ముందుకు పోలేదు.

లక్షణాలు

ఉన్నట్లుండి వెంటనే గుండెనొప్పి వస్తుంది. ఏదో బండరాయి మోపినట్లుగా, మంటలాగా వస్తుంది. కొద్దిక్షణాల్లో ఎడమ ఛాతీకి వ్యాపిస్తుంది. తర్వాత విపరీతమైన చెమటలు రావడం, కళ్లు తిరిగి పడిపోవడంగానీ, ఆయాసంగానీ వస్తుంది. ఏదో జరుగుతోందనే విషయం వారికి అర్థమవుతుంది. బతకకపోవచ్చని భావిస్తారు. గుండెపోటులో ఇది మొదటి లక్షణం. వయసు పెరిగిన వారిలో, మధుమేహ రోగుల్లో నొప్పి లేకుండా కూడా గుండెపోటు సంభవించవచ్చు. దీనిని 'సైలెంట్‌ హార్ట్‌ అటాక్‌' అంటాం.

తేడా ఎలా గుర్తించడం?

గుండెనొప్పికి, గ్యాస్‌ట్రబుల్‌కు తేడా గుర్తించడం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్యాస్‌ట్రబుల్‌కు సంబంధించి భోజనం చేసిన తర్వాత మంట ఎక్కువగా అవడం లేదా భోజనం చేశాక తగ్గుతుంది. మిగతా సమయాల్లో అంతగా అనిపించదు. గుండెలో నొప్పి పనిచేసినప్పుడు మంట వస్తుంది. చమటలు బాగా వస్తాయి. ఇసిజి తీస్తే కచ్చితంగా గుండెనొప్పిని తెలుసుకోవచ్చు.

ఆలస్యం చేయకూడదు

గుండెపోటు వచ్చినప్పుడు ఎంత తొందరగా హాస్పిటల్‌కెళితే అంత మంచిది. ఎందుకంటే వెంటనే చికిత్స చేయాలి. ఆలస్యం చేస్తే రక్తం గడ్డకడుతుంది. గడ్డమీద కొత్త ప్లేట్‌లెట్స్‌ అతుక్కోకుండా ఆస్ప్రిన్‌ టాబ్లెట్‌ ఇవ్వాలి. గుండెపోటు వచ్చిన తొలి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఈ సమయంలో ఆలస్యం చేయడం వల్ల 50 శాతం మంది చనిపోయే అవకాశముంది.

ప్రథమ చికిత్స

గుండెపోటు వచ్చిన రోగి మెట్లెక్కడం గానీ, డ్రైవింగ్‌గానీ, కదలడంగానీ చేయకూడదు. డిస్ప్రిన్‌ పేరుతో ఆస్ప్రిన్‌ టాబ్లెట్‌ దొరుకుతుంది. ఇది చాలామంది తలనొప్పికి వాడే మాత్ర. సర్వ సాధారణంగా ఇంట్లో అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని వెంటనే ఇవ్వాలి. తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

నిర్ధారణ

గుండెపోటును నిర్ధారించ డానికి చేసే మొదటి పరీక్ష ఇసిజి. తర్వాత కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. ఆ తర్వాత యాంజియో గ్రాం చేస్తే ఎక్కడ బ్లాక్‌ ఉందో తెలుస్తుంది. రక్తంలోని గడ్డను కరిగించడానికి ఒక ఇంజక్షన్‌ ఇస్తారు. యాంజియోగ్రాం తర్వాత వెంటనే స్టెంట్‌ చికిత్స చేస్తారు.

జాగ్రత్తలు

గుండెపోటుకు చికిత్స తర్వాత జీవితాంతం మందులు వాడాలి. బిపి, షుగర్‌, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్లో పెట్టుకోవాలి. భోజన విషయంలో చాలా జాగ్రత్తలు తీసు కోవాలి. మందులు టైమ్‌ ప్రకారం వాడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముందు 15 రోజులకు, తర్వాత నెలకు, తర్వాత 3 నెలలకు, 6 నెలలకు, ఏడాదికి గుండె పరీక్ష చేయించుకోవాలి. ఆతర్వాత ప్రతిఏడాదీకి ఒకసారి చెక్‌ చేయించుకోవాలి. నాలుగైదేళ్ల వరకు యాంజియోగ్రామ్‌ అవసరం ఉండదు. కానీ స్టెంట్‌ వేసిన తర్వాత ఐదేళ్లకు మళ్లీ ఎంజియోగ్రామ్‌ చేయించుకోవడం మంచిది. కొత్త సమస్య ఏర్పడితే ముందే గుర్తించ వచ్చు. కొవ్వు పదార్థాలు మానాలి. ఎక్కువగా కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు తీసుకోవాలి.

No comments:

Post a Comment