Monday, 29 August 2016

మా డ్రిల్లు కథ

పెద్దయింతరువాత ఏదేదో అయిపోతామని చిన్నప్పుడు అనుకుంటాం, ఏమీ కాకుండానే పెద్దవాళ్లమైపోతాం. రంగుల కలలు మాయమై గడ్డాలు మీసాలు బ్లాక్ అండ్ వైట్‌గా మారిపోతాయి. బ్లాక్‌ని వైట్‌మనీ చేసే మోడీ పథకాలుగా, వైట్‌ని బ్లాక్ హెయిర్ చేసే పథకాన్ని గోద్రేజ్‌వారు ఎప్పుడో ప్రవేశపెట్టారు. జుత్తుకి రంగేసిన తరువాత ఏదోఒకరోజు దురద తప్పదు. బాస్‌తో సీరియస్‌గా మాట్లాడుతున్నప్పుడే అది మొదలవుతుంది. గోక్కుంటే కొరివితో తల గోక్కున్నట్టే. వాడు మాట్లాడే పిచ్చివాగుడు అర్థం కాక తల గోక్కుంటున్నామని అనుకుంటాడు. కథకి సంబంధం లేకుండా మన సినిమాల్లో ఓపెనింగ్ సీన్ ఉన్నట్టు నేనిప్పటివరకు చెప్పిన హెయిర్‌డైకి ఇప్పుడు చెప్పబోయే దానికి ఏమీ సంబంధం లేదు. ప్రజలతో ప్రమేయం లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించినట్టు, కార్యకారణాలు లేకుండా జీవితం గడిచిపోతుంది.

చిన్నప్పుడు నాకు ఆటలంటే ఇష్టం. చదువుకోవాలంటే బుర్ర కావాలి. అది మన దగ్గర లేదు. లేనిది ఉన్నట్టు అభినయించాలంటే కొంచెం వయసు రావాలి. గోలీలు, బొంగరాలు, కోతికొమ్మచ్చి ఇవి మన ఆటలు. బుద్ధున్న ఏ డ్రిల్లు అయ్యవారూ ఇవి నేర్పడు. ఏమీ నేర్పకపోగా వూరికే గ్రౌండ్‌లో పరిగెత్తమనేవాడు. పరిగెత్తకపోతే బెత్తంతో పిర్రలపై కొట్టేవాడు. వూరికే విజిల్ వూదడం తప్ప ఏ ఆటా నేర్పించేవాడు కాదు. ఎప్పుడైనా డిఇవో వచ్చినప్పుడు, మెడకో డోలు తగిలించుకుని దబ్‌దబ్‌మని బాదుతూ మాతో డ్రిల్లు చేయించేవాడు.
 
ఒకసారి లేడీ డిఇవో వచ్చింది. మేము లెఫ్ట్ రైట్ కొట్టి, ఎప్పుడో ఒకసారి కనిపించే డిఇవో కంటే ఎప్పుడూ కనిపించే మా డ్రిల్లు అయ్యవారే గొప్పవాడని భావించి ఆయనకు మాత్రమే సెల్యూట్ చేశాం. ఆమె ఇగో హర్టయింది. ఇడియట్, బ్రూట్, స్టుపిడ్.. ఇంకా మాకు అర్థంకాని అనేక ఇంగ్లీష్ పదాలతో తిట్టింది. (ఇంగ్లిష్‌లో మాకు ప్రావీణ్యం లేకపోవడానికి కారణం మా ఇంగ్లిష్ మాస్టార్లకి ఇంగ్లిష్ రాకపోవడమే. అసలే ఇంగ్లిష్, ఆయనేం చెబుతున్నాడో ఆయనకే తెలియదు. ఇక మాకేం తెలుస్తుంది? స్కూళ్లలో ఇంగ్లిష్ ప్రవేశపెట్టకపోయినట్టయితే బ్రిటిష్ వాళ్ల మీద మనకు అంత ద్వేషం వుండేది కాదు. ఇంకో రెండొందల ఏళ్లు మనకు అర్థంకాని రీతిలో మనల్ని పాలించే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నారు).
 
ఆ స్త్రీమూర్తి తిడుతున్నప్పుడు మా డ్రిల్లు అయ్యవారు సియాచిన్‌లో ఐస్‌వాటర్ తాగుతున్నట్టు గజగజ వణికాడు. ఆయన మోకాళ్లు టకటక కొట్టుకున్నాయి. ఆయన బెత్తం దెబ్బలతో బండబారిన మా ఒళ్లు ఆనందంతో పులకించింది. ఈ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నందువల్ల మరుసటిరోజు నుంచి బెత్తాన్ని నాట్యం చేయించాడు. మమ్మల్ని ఆడుకోవడం తప్ప, మాకు ఆటలు నేర్పే అవకాశమే లేదని అర్థమై స్పోర్ట్స్‌మన్‌షిప్‌ని స్వయంకృషితో సాధించాలనుకున్నాం.
 
ఎక్కడినుంచో ఓ చిరిగిపోయిన ఫుట్‌బాల్ తీసుకొచ్చి చెప్పులు కుట్టే ఆయన దగ్గర కుట్టించాం. సైకిల్ షాప్‌లో గాలి కొట్టించాం. గేమ్స్ ఆడేవాళ్ళు బూట్లు వేసుకోవాలనే విషయం కూడా మాకు తెలియదు. కాళ్లకి స్లిప్పర్లు కూడా లేని బ్యాచ్ మాది.

ఫుట్‌బాల్ చూసిన ఆనందంలో యాహూ అని అరిచి కిక్ కొట్టాను. బాల్ ఎటుపోయిందో తెలియదు కానీ ఒక హృదయవిదారకమైన కెవ్వుకేక వినిపించింది. మాలో ఒకడికి తగలరాని చోట తగిలింది. అందరం పరారీ. వెతికి పట్టుకుని మరీ ఫుట్‌బాల్ ఆడారు.
 
ఈసారి క్రికెట్ మీద మీద పడ్డాను. కొంతమంది స్టయిల్‌గా సోల్‌కర్, గవాస్కర్, పటౌడీ అని ఏవేవో గొణిగేవారు. మనకి పకోడీ తప్ప పటౌడీ ఏం తెలుసు. ఇంకొంతమంది ట్రాన్సిస్టర్‌లో కామెంట్రీ వినేవాళ్లు. ఆ రేడియో మా తాత గురకలాగా కాసేపు, ఫుల్‌గా తినొస్తే వచ్చే త్రేన్పుల్లా కాసేపు రకరకాల సౌండ్స్ చేసేది. కామెంట్రీ ఇంగ్లిష్ అక్షరం అర్థం కాకపోయినా, మన తెలుగు సినిమా యంగ్ హీరోల్లా సంబంధం లేని ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేవాళ్లు.
 
ఏ ఆటా ఆడకుండానే టెన్త్ పాసయ్యాం. ఇంటర్‌లో నో డ్రిల్లు. యూనివర్సిటీలో ఏదో ఒక ఆటలో మాస్టర్ కావాలని డిసైడై పేకాట నేర్చుకున్నాం. చిన్నప్పుడు మాకు కనీసం గ్రౌండ్స్, డ్రిల్లు అయ్యవార్లు అయినా వుండేవాళ్లు. ఇప్పటి పిల్లలకి అదీ లేదు. కంప్యూటర్ గేమ్స్ తప్ప ఇంకొకటి తెలియనివాళ్లు లక్షల్లో వున్నారు. సింధు మెడల్ తెచ్చినప్పుడు మనందరం చప్పట్లు కొట్టి ఆనందంతో టీవీల ముందు కన్నీళ్లు కార్చాం. తెలుగు అమ్మాయి సింధుని చూసి గర్వపడడం మన హక్కు. కానీ టిఫిన్ కారియర్ సర్దుకుని, బరువైన పుస్తకాల సంచితో ఆటోల్లో వేలాడుతూ వెళుతున్న మీ అమ్మాయిల్లో కూడా సింధు దాగివుందేమో ఎప్పుడైనా గమనించారా?

జి.ఆర్. మహర్షి/ సాక్షి దిన పత్రిక కోసం రాసిన ఆర్టికల్

జైలు యాత్ర

ఈ జాతిని ఉద్ధరించి ఈ దేశాన్ని ఆకాశంలో నిలిపిన తరం ఆ రోజుల్లో జైళ్ల నుంచి బయటకు వచ్చింది. ఈ దేశాన్ని గబ్బు పట్టిస్తున్న నేటి తరం జైళ్ల వైపు ప్రయాణం చేస్తోంది.

తెలంగాణ జైళ్ల శాఖ ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నది. ఒకరోజు జైలు గదిని యాత్రికులకు అద్దెకి ఇస్తుంది. ఎవరైనా డబ్బు చెల్లించి వెళ్లిరావచ్చు. 219 సంవత్సరాల చరిత్ర గల సంగారెడ్డి జైలు, మ్యూజియంని ప్రజలు చూడడానికి ప్రారంభిస్తూ జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ గారు ఈ విషయాన్ని తెలియచేశారు. ఉద్దేశం? జైళ్లలో మగ్గడం ఎంత బాధాకరమో ప్రజలు స్వయంగా తెలుసుకుని జైలుకు వెళ్లే పనులు మానుకుంటారని. అక్కడ ఖైదీలు తినే బొచ్చెలోనే అన్నం పెడతారు. వారిలాగే నేల మీద నిద్రపోవాలి. ‘జైలు రుచి చూడండి!’ అనే పథకాన్ని వారు అమలు జరపబోతున్నారు.

నాకేమో సింగ్ గారు బొత్తిగా అమాయకులుగా, పెద్దమనిషిగా కనిపిస్తున్నారు. అయ్యా, ఈ రోజుల్లో ఎవరూ జైళ్లలో మగ్గడం లేదు. హాయిగా, నక్షత్రాల హోటళ్లలో ఉన్నట్టు సుఖంగా ఉన్నారు. ముఖ్య మంత్రులూ, కేంద్ర మంత్రులూ, ముఖ్యమంత్రుల ముద్దుల కూతుళ్లూ తరచు వెళ్లి వచ్చే జైళ్లు మగ్గే ధోరణిలో ఎందుకుంటాయి సార్? కావాలంటే సుబ్రతోరాయ్‌ని అడగండి. మొన్నే తాజాగా వెళ్లివచ్చిన మేడమ్ జయలలితని అడగండి. త్వరలో వెళ్లబోతున్న విజయ్ మాల్యా గారి కోసం జైళ్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగు తున్నాయని వినికిడి.  అక్కడ సరసమైన ధరలకు మత్తు పదార్థాలు దొరుకుతాయనీ, మొబైల్ ఫోన్లు మనకి సరిగ్గా పనిచేయకపోవచ్చు గానీ మొబైల్ కంపెనీలు జైళ్లలో ఉన్న పెద్దల విషయంలో అలాంటి రిస్కులు తీసుకోరనీ వినికిడి. చక్కని భోజనం, వ్యాపార చర్చలు జరుపుకోవడానికి సుబ్రతోరాయ్‌గారికి అన్ని సౌకర్యాలు జైల్లో కల్పించవల సిందిగా సుప్రీంకోర్టు ఆ మధ్య తాఖీదులు ఇచ్చింది.

నేను బ్రిటిష్‌వారి పాలనలో పుట్టాను. నా తరంలో జైలుకి వెళ్లి రావడం ఒక ఘనతగా, త్యాగానికి ప్రతీకగా చెప్పుకునేవారు. ‘‘ఆయన జైలుకు వెళ్లివచ్చారు’’ అంటే గొప్పగా, గర్వంగా చెప్పుకునేవారు. స్వాతంత్య్రం వచ్చాక జైలుకి వెళ్లి వచ్చిన యోధులకు ప్రత్యేకమయిన గుర్తింపులను ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఆనాటి వైభవం.

ఇప్పుడు జైలుకు వెళ్లివచ్చినవారూ, వెళ్లవలసిన వారూ మనకి పార్లమెంటులో, శాసనసభలలో దర్శనమిస్తున్నారు.

మన దేవుడు జైల్లోనే పుట్టాడు. మధురలో శ్రీకృష్ణుడు అవతరించిన జైలు గదిని చూశాను. అండమాన్ దీవులలో సెల్యులార్ జైలును చూశాను. ఆ త్యాగధనుల్ని తలుచుకుని కంటతడి పెట్టాను. ముఖ్యంగా వీర సావర్కర్ జైలు గది. ఇక- దక్షిణా ఫ్రికాలో జోహెన్స్‌న్‌బర్గ్‌లో రాబిన్ ద్వీపంలో నెల్సన్ మండేలా దాదాపు పాతిక సంవ త్సరాలు ఉన్న జైలుని చూసి తరించాను.

ఓ సరదా అయిన కథ. 1931లో రాయవెల్లూరు సెంట్రల్ జైలుకి సన్నగా రివటలాగ నల్లకళ్లద్దాలతో ఉన్న కొత్త ఖైదీని తీసుకొచ్చారు. ‘ఎవరీయన?’ అనడిగాడు ఓ ఖైదీ. ప్రొఫెసర్ ఎన్. జి. రంగా అనే ఖైదీ సమాధానం ఇచ్చారు. ‘ఆయన రాజగోపాలాచారి. ఈ దేశానికి గవర్నర్ జనరల్ కాగలిగిన సామర్థ్యం ఉన్నవాడు’. మరొక 17 సంవత్సరాలకి రాజాజీ గవర్నర్ జనరల్ అయ్యారు. నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ జైల్లో రాశారు. అదీ ఆనాటి ఖైదీల వైభవం.

తన జీవితకాలంలో గాంధీ మహాత్ముడు 13సార్లు జైలుకి వెళ్లారు. ఏ నేరమూ చెయ్యని మరొక వ్యక్తి కూడా జైలులో ఉన్నారు. ఆవిడ పేరు కస్తూరిబా గాంధీ.

మరో కథ. 1908లో ప్రఫుల్ల చకీ, ఖుదీరాం బోస్ అనే ఇద్దరు విప్లవకారులు అప్పటి ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్‌ని చంపడానికి బాంబు వేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్టు చేసింది. బాలగంగాధర తిలక్ వారి తరఫున వాదించడానికి సిద్ధపడి దేశద్రోహ నేరం కింద అరెస్టయ్యారు. ఆయన్ని మాండలే జైలులో పెట్టారు. తిలక్ జైల్లో  భగవద్గీతా రహస్యం అనే గీతా భాష్యాన్ని రాసి - ఆ పుస్తకం ముద్రితమయ్యాక - దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముని స్వతంత్ర పోరాట నిధికి జమ చేశారు. ఇవి ఆనాటి కొన్ని నమూనా జైలు కథలు.

మహాకవి దాశరథి నిజాం కాలంలో ఇందూరు జైల్లో వట్టికోట ఆళ్వారుస్వామి వంటి సహచరులతో ఉంటూ తన ప్రముఖ కావ్యం ‘అగ్నిధార’ రాశారు. అక్కడ నుంచే ‘నా తెలంగాణ-కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తారు. ఈ జాతిని ఉద్ధరించి ఈ దేశాన్ని ఆకాశంలో నిలిపిన తరం ఆ రోజుల్లో జైళ్ల నుంచి బయటకు వచ్చింది. ఈ దేశాన్ని గబ్బు పట్టిస్తున్న తరం ప్రస్తుతం జైళ్ల వైపు ప్రయాణం చేస్తోంది. సింగ్‌గారూ! క్షమించండి. మీరు ఒక తరం ఆలస్యంగా కొత్త ఆలోచన చేశారు. ప్రస్తుతం మేము ఉన్న జైలు మాకు చాలు.

రచయిత: గొల్లపూడి మారుతీరావు/ సాక్షి దిన పత్రిక కోసం రాసిన ఆర్టికల్